*'అర్నబ్' తుఫాను ప్రభావం – పొంగిపొర్లుతున్న కాజ్‌వేలు – ప్రజలకు పోలీసు వారి అత్యవసర హెచ్చరిక*
*అనకాపల్లి /బుచ్చయ్యపేట, అక్టోబర్ 28:* 'అర్నబ్' తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పి.వి.వి. నరసింహారావు గారి మార్గదర్శకత్వంలో, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో బుచ్చయ్యపేట ఎస్సై మనోజ్ కుమార్ ప్రజలకు పలు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.
తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు బుచ్చయ్యపేట మండల పరిధిలోని వడ్డాది మరియు విజయరామరాజు పేట కాజ్‌వేలపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరినందున, ప్రజల ప్రాణరక్షణ దృష్ట్యా పోలీసులు అప్రమత్తమై ఈ క్రింది చర్యలు చేపట్టారు:
*రాకపోకలపై పూర్తి నిషేధం:* వడ్డాది, విజయరామరాజుపేట కాజ్‌వేలపై నుంచి పాదచారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలతో సహా ఎలాంటి వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు.
*పశువులను దాటించవద్దు:* పశువుల కాపరులు తమ మూగజీవాలను కాజ్‌వేలు దాటించే ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడవద్దని హెచ్చరిస్తున్నాము.
*ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి:* బుచ్చయ్యపేట, వి.మాడుగుల, చోడవరం, చీడికాడ మండలాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా వరద ప్రవాహం ఉన్న మార్గాల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
*ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయవద్దు:* నీటి ఉధృతిని తేలికగా తీసుకుని కాజ్‌వేలు దాటే సాహసాలు చేసి విలువైన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దు.
ప్రజల మరియు పశువుల ప్రాణనష్టం నివారించడమే పోలీసు యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యం. వాతావరణం అనుకూలించి, వరద నీరు తగ్గుముఖం పట్టే వరకు కాజ్‌వేల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తుకు, అధికారుల ఆదేశాలకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని కోరుతున్నాము.
అత్యవసర పరిస్థితుల్లో లేదా సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్:
డైల్ 112 / స్థానిక పోలీస్ స్టేషన్.
@APPOLICE100
*అనకాపల్లి జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం: 20 నిమిషాల్లోనే తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించిన యంత్రాంగం*
*సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు,*
*సిబ్బంది అధికార యంత్రాంగం పనితీరును అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్*
*అనకాపల్లి, అక్టోబర్ 27:* అనకాపల్లి జాతీయ రహదారిపై డైట్ (DIET) ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో మంగళవారం ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా రహదారికి అడ్డంగా కూలిపడింది. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు స్తంభించి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించింది. జోనల్ కమిషనర్ శ్రీ చక్రవర్తి, తహసీల్దార్ (MRO) ఆనందరావు, అనకాపల్లి ట్రాఫిక్ సీఐ నాగేశ్వరరావు, అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమకుమార్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఆధునిక పరికరాలను ఉపయోగించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని పూర్తిగా తొలగించి, మార్గాన్ని సుగమం చేశారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించారు.
ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా తక్షణమే స్పందించి, రికార్డు సమయంలో మార్గాన్ని క్లియర్ చేసిన అధికారులు, సిబ్బంది సమన్వయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో అధికారులు ఇలాగే అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
#AndhraPradeshStatePolice
@APPOLICE100
‘ఆర్నబ్’ తుఫాను తీవ్రత దృష్ట్యా జాతీయ రహదారి (NH-16) పై రాత్రి 9:00 గంటల తర్వాత వాహనాల రాకపోకలపై ఆంక్షలు – జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.*
*అనకాపల్లి, అక్టోబర్ 27: * ‘ఆర్నబ్’ తుఫాను ఈరోజు రాత్రి మరింత ఉధృతరూపం దాల్చే అవకాశం ఉన్నందున, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణార్థం జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు.
*ప్రధాన వివరాలు & ఆదేశాలు:*
*రవాణా ఆంక్షలు:* నేటి రాత్రి 9:00 గంటల తర్వాత ఎన్.హెచ్-16 (NH-16) మార్గంలో తుని వైపు నుంచి అనకాపల్లి మీదుగా వెళ్లే వాహనాలు, అలాగే విశాఖపట్నం మరియు సబ్బవరం మీదుగా తుని వైపు వెళ్లే అన్ని రకాల వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది.
*పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు:* సంబంధిత హైవే పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs) మరియు హైవే పెట్రోలింగ్/మొబైల్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, వాహనాలను ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేసేలా పర్యవేక్షించాలి.
*ప్రజలకు విజ్ఞప్తి:* తుఫాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా ఎస్పీ గారు కోరారు.
*అత్యవసర సహాయం కొరకు సంప్రదించవలసిన నంబర్లు:*
ఏదైనా ఆపద లేదా సహాయం అవసరమైతే వెంటనే స్థానిక పోలీసులను గానీ, లేదా క్రింది నంబర్లను గానీ సంప్రదించగలరు:
అత్యవసర విభాగం: డయల్ 112 / 100
జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 94409 04229
#AndhraPradeshStatePolice
@APPOLICE100
*తుపాను సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న గౌరవ హోం మంత్రి వంగలపూడి అనిత గారు;*
*ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర పర్యవేక్షణ*
*అనకాపల్లి, అక్టోబర్ 27:* ‘అర్నబ్’ తుపాను ప్రభావం నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేశాయి. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
*బాధిత ప్రజలకు అండగా గౌరవ హోం మంత్రి:*
*రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.* బోయపాడు తుపాను పునరావాస కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న భోజన, వసతి, వైద్య సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, అడ్డురోడ్డు ఆర్డీవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
*జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలు:*
*వరద ముప్పు ప్రాంతాల పరిశీలన:* గత అనుభవాల దృష్ట్యా వరద ముంపునకు గురయ్యే అనకాపల్లి రూరల్ పరిధిలోని వెంకుపాలెం, కుంచంగి గ్రామాలను అనకాపల్లి ఎస్డీపీవో (డీఎస్సీ) పి.వి.వి.నరసింహారావు, రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
*కాజ్‌వేల పర్యవేక్షణ:* బుచ్చెయ్యపేట మండలంలోని విజయరామరాజుపేట, వడ్డాది కాజ్‌వేలను ఎస్డీపీవో పి.వి.వి. నరసింహారావు, బుచ్చెయ్యపేట ఎస్సై మనోజ్ కుమార్ పరిశీలించి, నీటి ప్రవాహం పెరిగితే రాకపోకలను వెంటనే నియంత్రించేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
*తీర ప్రాంత గ్రామాల్లో అప్రమత్తత:* నర్సీపట్నం ఎస్డీపీవో పి.శ్రీనివాసరావు, నక్కపల్లి రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్.రాయవరం ఎస్సై రమేష్ రేవుపోలవరం గ్రామాన్ని సందర్శించి తుపాను రక్షణ చర్యలపై స్థానికులకు, మత్స్యకారులకు సూచనలు చేశారు.
*బాధితుల తరలింపు – అత్యవసర యంత్రాల మోహరింపు:* భారీ వర్షాల కారణంగా లంకెలపాలెంలో గుడిసెల్లో నివసిస్తున్న 20 మందిని పరవాడ ఎస్సైలు భీమరాజు, మహాలక్ష్మి సహాయంతో గంగిరెడ్ల కాలనీలోని ఎంపీపీ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు. రెవెన్యూ శాఖ సహకారంతో వారికి ఆహారం, నిత్యావసరాలు అందించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లంకెలపాలెం, రాంకీ జంక్షన్, పరవాడ సబ్‌స్టేషన్ ప్రాంతాల్లో జేసీబీలు, క్రేన్లు, చెట్ల కట్టర్లు, టిప్పర్లను పరవాడ డీఎస్పీ బి.మోహన్ రావు, సీఐ భాస్కరరావు పర్యవేక్షణలో సిద్ధంగా ఉంచారు.
*తక్షణ స్పందన – ట్రాఫిక్ పునరుద్ధరణ:* ఎలమంచిలి పట్టణ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కొమ్మ విరిగిపడటంతో ఎలమంచిలి సీఐ ధనుంజయరావు, టౌన్ ఎస్సై సావిత్రి వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి తొలగించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా రాకపోకలను పునరుద్ధరించారు.
తుపాను తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు కోరారు.
@APPOLICE100
*తుపాను సహాయక చర్యల్లో ముమ్మరంగా పోలీస్ యంత్రాంగం: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్*
*సహాయక శిబిరాల్లో వసతులు, భోజనం, వైద్య సదుపాయాల పరిశీలన*
*తీరప్రాంత ప్రజలకు అప్రమత్తత హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాలకు తరలింపు*
*ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలతో సమన్వయం*
*అనకాపల్లి అక్టోబర్ 27:* తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో ముమ్మర సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ అధికారులు విస్తృతంగా పర్యవేక్షిస్తున్నారు.
*సహాయక శిబిరాల తనిఖీ - పికెట్ ఏర్పాటు:*
రోలుగుంట మండలం, శరభవరం పునరావాస కేంద్రాన్ని కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్సై రామకృష్ణారావు సందర్శించారు. శిబిరంలోని వసతులు, ఆహారం, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, రక్షణ నిమిత్తం ప్రత్యేక పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు.
*పూడిమడక తీరంలో అప్రమత్తత:*
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్, మెరైన్ సీఐ, ఎస్సై సుధాకర్ సిబ్బందితో కలిసి పూడిమడక తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుపాను తీవ్రతను వివరిస్తూ మత్స్యకారులు, స్థానిక ప్రజలు వేటకు వెళ్లవద్దని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.
*ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయ సమావేశం:*
నక్కపల్లి జెడ్పీ హైస్కూల్ వద్ద మోహరించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాన్ని నక్కపల్లి సీఐ మురళి కలిసి పరిస్థితిని వివరించారు. రాగల 48 గంటల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు, అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన రక్షణ, సహాయక చర్యలపై ప్రణాళికను సిద్ధం చేశారు.
*సంచార జాతుల ప్రజల సురక్షిత తరలింపు:*
తుపాను ప్రభావంతో ముందస్తు జాగ్రత్త చర్యగా వడ్డాది గ్రామం శివార్లలో నివసిస్తున్న సంచార జాతులకు చెందిన సుమారు 36 మందిని వడ్డాది తుపాను సహాయక కేంద్రానికి తరలించారు.
బుచ్చెయ్యపేట ఎస్సై మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వారికి తగిన వసతి, నాణ్యమైన ఆహారం, తాగునీరు మరియు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.
తుపాను తీరం దాటే వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
@APPOLICE100
*'ఆర్నబ్' తుఫాన్ ఎదుర్కొనేందుకు అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధం*
*ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పోలీసుల ముమ్మర సహాయక చర్యలు*
*తుఫాన్ పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజల తరలింపు*
*సిద్ధంగా NDRF, SDRF బృందాలు,73 జేసీబీలు, భారీ క్రేన్లు, వుడ్ కట్టర్లు*
*ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం:జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్*
*అనకాపల్లి, అక్టోబర్ 27:* బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నబ్’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా అనకాపల్లి జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తమై సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు తెలిపారు.
*జిల్లా పోలీసు శాఖ చేపట్టిన కీలక చర్యలు మరియు సన్నద్ధత వివరాలు:*
*పునరావాస కేంద్రాలకు తరలింపు:* తీర ప్రాంతాలు మరియు ముంపు ముప్పు ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలను, వృద్ధులను, చిన్నారులను పోలీసులు దగ్గరుండి సురక్షిత తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి అవసరమైన భద్రత, సహాయాన్ని అందిస్తున్నారు.
*NDRF, SDRF మోహరింపు:* అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ల కోసం NDRF, SDRF ప్రత్యేక బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి.
*రహదారుల క్లియరెన్స్ & పరికరాల లభ్యత:* ఈదురు గాలుల ధాటికి రహదారులపై విరిగిపడిన భారీ వృక్షాలు, కొమ్మలను క్రేన్లు, వుడ్ కట్టర్ల సహాయంతో పోలీసులు తక్షణమే తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్నారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కలిపి మొత్తం 73 జేసీబీలు (JCBs), 2 భారీ హైడ్రాలిక్ క్రేన్లు, 77 వుడ్ కట్టర్లు, 34 జనరేటర్లు, ట్రాక్టర్లు మరియు 179 మంది సహాయక సిబ్బందిని (Laborers) సర్వసన్నద్ధంగా ఉంచారు.
*పటిష్ట కమ్యూనికేషన్ వ్యవస్థ:* విద్యుత్ సరఫరా లేదా సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లు నిలిచిపోయినా సహాయక చర్యలకు అంతరాయం కలగకుండా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి మారుమూల స్టేషన్ల వరకు ప్రత్యేక వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్ మరియు శాటిలైట్/VHF వ్యవస్థను నిరంతరం అందుబాటులో ఉంచారు.
*తీర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా:* తుఫాన్ తీవ్రత తగ్గే వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని తీర గ్రామాల్లో డప్పు చాటింపులు, మైకుల ద్వారా విస్తృత అవగాహన కల్పించారు. తీరప్రాంత గస్తీని ముమ్మరం చేశారు.
తుఫాన్ గడిచేవరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, శిథిలావస్థలో ఉన్న భవనాలు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాల కింద ఉండరాదని ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు కోరారు.
ఎలాంటి ఆపద లేదా అత్యవసర సహాయం కావాలన్నా స్థానిక పోలీసులను లేదా డయల్ 112 / 100 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 94409 04229 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
@APPOLICE100
అనకాపల్లి, అక్టోబర్ 26: అవినీతిని నిర్మూలించి, పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న 'విజిలెన్స్ వారోత్సవాల'లో భాగంగా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా ప్రజలు భయపడకుండా వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని సూచించారు. సమాజంలో అవినీతి రహిత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రజల్లో చైతన్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఫిర్యాదుల కొరకు సంప్రదించాల్సిన వివరాలు:
టోల్ ఫ్రీ నెంబర్: 1064
వాట్సాప్ నెంబర్: 94404 40057
ఈమెయిల్: [email protected]
ఫోన్ నెంబర్: 0866-2428770
ప్రజలు ఈ నెంబర్లను ఉపయోగించుకుని అవినీతిపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ శ్రీ బి.వి.ఎస్.ఎస్. రమణమూర్తి, అనకాపల్లి ఎస్.బి. సీఐ బాల సూర్యారావు, ఏసీబీ సీఐ సిహెచ్.వెంకట్రావు మరియు ఏసీబీ, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
@APPOLICE100
ఆర్నాబ్ తుఫాను ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం: అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ
అనకాపల్లి, అక్టోబర్ 26: ఆర్నాబ్ తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశించారు.
కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (DRO), సబ్ డివిజన్ డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHO), ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను సన్నద్ధతపై సమగ్ర సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎస్పీ మాట్లాడుతూ శాఖల వారీగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:
రహదారులు & భవనాలు (R&B), పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ: తుఫాను వల్ల ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లపై నేలకూలే భారీ వృక్షాలు, కొమ్మలు, విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించేందుకు తగినన్ని జేసీబీలు (JCB), పవర్ సా కట్టర్లు (ట్రీ కటింగ్ మిషన్లు) మరియు ప్రత్యేక బృందాలను నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా రూట్ క్లియరెన్స్ పనులు చేపట్టాలి.
నీటిపారుదల శాఖ (ఇరిగేషన్): జిల్లాలోని అన్ని డ్యామ్‌లు, జలాశయాలు (రిజర్వాయర్లు), చెరువుల నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రమాదకర స్థాయికి నీరు చేరకముందే ఇతర శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ సమాచారం అందించాలని, తద్వారా లోతట్టు మరియు పరివాహక ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ: పల్లెలు, పట్టణాలలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలు, రేకుల ఇళ్లు, పూరిళ్లలో నివసించే వారిని వెంటనే గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బలమైన గాలుల వల్ల ప్రమాదాలు జరగకుండా హోర్డింగులను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.
పునరావాస కేంద్రాలు (రిలీఫ్ సెంటర్లు): లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత తుఫాను రిలీఫ్ కేంద్రాలకు తరలించాలని, అక్కడ స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
వైద్యారోగ్య శాఖ (DM&HO): ఆసుపత్రులలో వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ప్రసవ తేదీలు ఉన్న గర్భిణులను గుర్తించి, ముందుగానే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని స్పష్టం చేశారు.
జాతీయ రహదారులు (NHAI): నేషనల్ హైవేలపై ఎటువంటి ట్రాఫిక్ జామ్‌లు మరియు అనధికార పార్కింగ్లు లేకుండా హైవే మొబైల్స్, హైవే అంబులెన్సులతో పర్యవేక్షించాలని సూచించారు.
పోలీస్ & రెవెన్యూ సమన్వయం: పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర విభాగాలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలతో సిద్ధంగా ఉందని, అత్యవసర సమయాల్లో అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని అధికారులు కోరారు.
@APPOLICE100
దివంగత కానిస్టేబుల్ పైలా మోహన్ కుటుంబానికి 2009 బ్యాచ్ పోలీసుల అండ: రూ.2.88 లక్షల ఆర్థిక సాయం అందజేత
దేవరపల్లి, అక్టోబర్ 26: విధుల నిర్వహణలో నిబద్ధతతో ఉంటూ, ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందిన తోటి కానిస్టేబుల్ పైలా మోహన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు 2009 బ్యాచ్ పోలీసు సిబ్బంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా (ప్రస్తుత అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు) 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ సేకరించిన రూ.2,88,000/- ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ స్పెషల్ బ్రాంచ్ (SB) విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పైలా మోహన్ (స్వగ్రామం: దేవరపల్లి మండలం, కొత్తపెంట) గత బుధవారం (14.10.2026) ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య భవాని, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మోహన్ దశదిన కర్మ సందర్భంగా కొత్తపెంట గ్రామంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో 2009 బ్యాచ్ పోలీసు సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బ్యాచ్‌కు చెందిన 191 మంది సిబ్బంది సమకూర్చిన రూ.2,88,000/- నగదును మోహన్ భార్య పైలా భవాని, వారి పిల్లలకు అందజేశారు.
ఈ సందర్భంగా సహచర సిబ్బంది మాట్లాడుతూ... తోటి మిత్రుడిని కోల్పోవడం తమ బ్యాచ్‌కే కాకుండా శాఖకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ చురుగ్గా, స్నేహభావంతో ఉండే మోహన్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మోహన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని, పిల్లల భవిష్యత్తుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా పరిధిలోని 2009 బ్యాచ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, గ్రామ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
@APPOLICE100
దేవరపల్లి గంజాయి రవాణా కేసులో ఇద్దరు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా
అనకాపల్లి / చోడవరం, అక్టోబర్ 26: దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో నిందితులకు చోడవరం తొమ్మిదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానం (IXth ADJ Court) 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,00,000/- జరిమానా విధిస్తూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
కేసు వివరాలు మరియు కోర్టు తీర్పు:
దేవరపల్లి పోలీస్ స్టేషన్
క్రైమ్ నంబర్: 12/2016
ఎన్ఎస్సీ (NSC) నంబర్: 402/2017
న్యాయస్థానం: IX అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి కోర్టు, చోడవరం, అనకాపల్లి జిల్లా
గౌరవ న్యాయమూర్తి: శ్రీ ఎం.హరినారాయణ గారు
చట్టం & సెక్షన్లు: U/Sec. 20(b)(ii)(C) r/w 8(c) NDPS Act, సెక్షన్ 235(2) Cr.P.C.
నిందితుల వివరాలు:
A-1: కొసూరి ఈశ్వరరావు (29 సం.), తండ్రి: సన్యాసిరావు, ఆటో డ్రైవర్, తామరబ్బ గ్రామం, దేవరపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా.
A-2: దుంబరి రాజు (31 సం.), తండ్రి: సన్యాసిరావు, వార్డు మెంబర్, జీనబాడు గ్రామం, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా.
(గమనిక: ఈ కేసులో A-3 గా ఉన్న కుమారేశన్ మరణించారు. ఆయన డెత్ సర్టిఫికేట్ ఇంకా సమర్పించకపోవడంతో A-1, A-2 కేసు నుండి వేరు చేసి NSc. No. 695/2025 కింద నమోదు చేయడం జరిగింది).
ఖరారైన శిక్ష:
నేరం రుజువైనందున A-1 మరియు A-2 లకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష.
ఒక్కొక్కరికి రూ.1,00,000/- జరిమానా. జరిమానా చెల్లించని యెడల అదనంగా 2 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: 110 కిలోల గంజాయి (అప్పటి విలువ దాదాపు రూ.2,20,000/-), ఒక ఆటో (AP 31 TG 9487), 3 సెల్ఫోన్లు.
దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ వాదనలు:
గతంలో దేవరపల్లి ఎస్సైగా పనిచేసిన డి.ఈశ్వరరావు గారు సమగ్రంగా దర్యాప్తు జరిపి, గంజాయి రవాణాకు సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాధారాలను సేకరించి గౌరవ న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) శ్రీ చీపురుపల్లి సూర్యనారాయణ గారు ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను, దర్యాప్తు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి శ్రీ ఎం.హరినారాయణ గారు నిందితులపై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ పైవిధంగా కఠిన శిక్షను ఖరారు చేశారు.
అభినందనలు మరియు జిల్లా ఎస్పీ హెచ్చరిక:
కేసును ప్రతిభావంతంగా దర్యాప్తు చేసి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్సై డి.ఈశ్వరరావు, ప్రాసిక్యూషన్ వాదనలు బలంగా వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ చీపురుపల్లి సూర్యనారాయణ, దేవరపల్లి పోలీస్ సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ:
"గంజాయి, ఇతర మత్తు పదార్థాల సాగు, నిల్వ లేదా రవాణా చేసేవారు ఎవరైనా సరే చట్టం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల రవాణాదారులపై జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. నేరస్థులకు కోర్టుల ద్వారా తగిన శిక్షలు పడేలా పక్కా సాక్ష్యాధారాలతో విచారణ కొనసాగిస్తాం."
@APPOLICE100
‘అర్నాబ్’ తుఫాను ముప్పు: అధికార యంత్రాంగం అప్రమత్తం – ప్రజలు సహకరించాలి
రెస్క్యూ చర్యలకు పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్
అనకాపల్లి, అక్టోబర్ 26: రాబోయే ‘అర్నాబ్’ తుఫాను తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు. తీరప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు రెస్క్యూ బృందాల మోహరింపు: ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు (QRT) నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.
తీరప్రాంత పెట్రోలింగ్: లోతట్టు, సముద్ర తీర గ్రామాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలి.
సెలవులు రద్దు: తుఫాను ముప్పు ముగిసే వరకు జిల్లా పోలీస్ సిబ్బంది, అత్యవసర సేవల అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి; ఎవరికీ ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవు.
వదంతులపై కఠిన నిఘా: సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా తుఫానుకు సంబంధించి అసత్య ప్రచారాలు, పుకార్లు వ్యాప్తి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
పునరావాస చర్యలు & ముందస్తు ఏర్పాట్లు
లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంతాల ప్రజలను రెవెన్యూ అధికారుల సమన్వయంతో తక్షణమే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలి.
పునరావాస కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన భోజనం తదితర సదుపాయాలు పక్కాగా అందేలా పర్యవేక్షించాలి.
వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు ఈదురు గాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
కూలిపోయే ప్రమాదం ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద నిలబడవద్దు.
తెగిపడిన విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దు; వెంటనే విద్యుత్ శాఖకు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలి.
ఉధృతంగా ప్రవహించే వాగులు, కాజ్‌వేలు, వరద నీరు చేరిన రహదారులను దాటే సాహసం చేయరాదు.
సరిపడా తాగునీరు, నిల్వ ఉండే ఆహారం, నిత్యావసర మందులు, టార్చ్‌లైట్లతో పాటు మొబైల్ ఫోన్లను ముందే ఫుల్ ఛార్జ్ చేసి ఉంచుకోవాలి.
అనధికారిక సమాచారాన్ని, పుకార్లను నమ్మవద్దు; కేవలం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక హెచ్చరికలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే సంప్రదించాల్సిన నంబర్లు: స్థానిక పోలీసులు గాని,
పోలీస్ ఎమర్జెన్సీ: 112 / 100
ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ విభాగం నిరంతరం అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.
@APPOLICE100
*ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట పోలీసు భద్రత*
*ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాలతో ఎంపీడీవో కేంద్రాల వద్ద ముమ్మర బందోబస్తు*
*అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా..*
*ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు*
*అనకాపల్లి, అక్టోబర్ 24:* అనకాపల్లి జిల్లావ్యాప్తంగా జరుగుతున్న స్థానిక ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అన్ని మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయాలు, నామినేషన్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును మోహరించారు.
*ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు చేపట్టిన ముఖ్యమైన భద్రతా చర్యలు:*
నామినేషన్ల పరిశీలన కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలు చేస్తూ, అనధికార వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలతో పాటు వీడియో కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.
ఎలాంటి ఘర్షణలు లేదా అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా బందోబస్తు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
పరిశీలన విధుల్లో ఉన్న అధికారులు, అలాగే పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
@APPOLICE100
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా పటిష్ట పోలీసు బందోబస్తు: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్
అనకాపల్లి, అక్టోబర్ 23: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణ: జిల్లాలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు.
స్వేచ్ఛగా నామినేషన్ల దాఖలు: ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులెవరైనా ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో వచ్చి నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
రక్షణ కల్పన: నామినేషన్ దాఖలు చేయకుండా ఎవరైనా బెదిరించినా, ఆటంకాలు లేదా అడ్డంకులు సృష్టించినా వెంటనే సంబంధిత స్థానిక పోలీసు అధికారులను లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి. అటువంటి వారికి తక్షణమే తగిన వ్యక్తిగత భద్రత కల్పించి, నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి నిర్ణీత గడువులోగా సజావుగా నామినేషన్ వేసేలా చర్యలు చేపడతాము.
చట్టపరమైన చర్యలు: నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడమైనది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరడమైనది.
@APPOLICE100
ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పర్యటన – భద్రతా ఏర్పాట్ల పరిశీలన
అనకాపల్లి (బుచ్చయ్యపేట, కొత్తకోట, రోలుగుంట), అక్టోబర్ 22: అనకాపల్లి జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజుకు చేరిన నేపథ్యంలో, నామినేషన్ కేంద్రాలు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు విస్తృతంగా పర్యటించారు.
బుచ్చయ్యపేట మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్సై మనోజ్ కుమార్‌లతో కలిసి; రావికమతం ఎంపీడీవో కార్యాలయం వద్ద కొత్తకోట ఎస్సై శ్రీనివాస్‌తో; అలాగే రోలుగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎస్సై రామకృష్ణారావుతో కలిసి జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షించారు.
అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు జారీ చేసిన ముఖ్య ఆదేశాలు & సూచనలు:
100 మీటర్ల పరిధిలో గుంపులను అనుమతించవద్దు: నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 100 మీటర్ల లైన్ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా తక్షణమే అక్కడ ఉన్న గుంపులను చెదరగొట్టాలని స్పష్టం చేశారు. వేర్వేరు పార్టీల వర్గాల మధ్య ఎలాంటి వాగ్వాదాలు, ఘర్షణలు తలెత్తకుండా 100 మీటర్ల పరిధి బయటే నియంత్రించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పరిమిత సంఖ్యలోనే అనుమతి: నామినేషన్ కేంద్రం 100 మీటర్ల పరిధిలోకి అనవసరపు వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని, నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురికి మించి ఎక్కువ మంది ఉండకూడదని స్పష్టం చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థులు, వారితో వచ్చిన వ్యక్తులు అక్కడే వేచి ఉండకుండా వెంటనే వెనుదిరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ర్యాలీల సమయాల్లో సమన్వయం: వివిధ రాజకీయ పార్టీలు ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేసేలా సమన్వయం చేసుకోవాలని, శాంతిభద్రతల సమస్యలు రాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ నిర్ణీత గడువులోగా ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు.
నిరంతర డ్రోన్ నిఘా & కఠిన చర్యలు: భద్రతా పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తూ నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు అమలు: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. (144 సి.ఆర్.పి.సి) అమల్లో ఉన్నట్లు ఎస్పీ గారు పునరుద్ఘాటించారు. ప్రజలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
ఈ పర్యటనలో సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@APPOLICE100
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు – జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్; ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్
అనకాపల్లి, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
పోలీసులు అందించే భరోసాతోనే జిల్లా ప్రగతి – జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్:
కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ –
"సమాజంలో శాంతిభద్రతల రక్షణ కోసం ముఖపరిచయం లేని సాధారణ పౌరుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే గొప్ప వృత్తి యూనిఫాం సర్వీస్. గడచిన రెండేళ్లలో అనకాపల్లి జిల్లా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాకు రూ.4 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మన పోలీసు విభాగం కల్పిస్తున్న పటిష్టమైన శాంతిభద్రతలు, రక్షణే. పెట్టుబడిదారులకు, ప్రజలకు భయం లేకుండా ముందుకు సాగేలా నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల కృషి ఎంతో గొప్పది. జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం, విద్యావ్యవస్థ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం మరింత ప్రగతిపథంలో పయనిస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని పేర్కొన్నారు.
అమరవీరుల త్యాగస్ఫూర్తితో ప్రజాసేవలో ముందుంటాం – జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్:
అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ –
"1959 అక్టోబర్ 21న చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ రక్షణ కోసం పోరాడి అసువులు బాసిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల స్మారకార్థం ప్రతి ఏటా ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకరు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. నేడు లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (నక్సలిజం), ఉగ్రవాదం వంటి సమస్యలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అణచివేసేందుకు పోలీసు సిబ్బంది మరింత ప్రొఫెషనలిజంతో పనిచేయాలి. చట్టపరిధిలో తమ విధులను నిర్భయంగా, నిస్వార్థంగా నిర్వహించినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడంలో వారి కుటుంబ సభ్యుల పాత్ర, మద్దతు ఎంతో కీలకమైనవి. అమరుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది" అని తెలిపారు.
ఈ సందర్భంగా 1983 నుంచి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ పరిధిలో వీరమరణం పొందిన 27 మంది అమరవీరుల వివరాలను, దేశవ్యాప్తంగా అమరులైన పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు చదివి వినిపించారు.
అనంతరం కలెక్టర్ మరియు ఎస్పీల చేతుల మీదుగా 14 మంది అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10,000/- చొప్పున నగదు చెక్కులను, జ్ఞాపికలను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, డీఎస్పీలు శ్రీ పి.శ్రీనివాస రావు, శ్రీ పి.వి.వి. నరసింహారావు, శ్రీ వి.బాబ్జీరావు, పరిపాలనాధికారి శ్రీ సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, ప్రేమ కుమార్, అశోక్ కుమార్, నాగేశ్వరరావు, రమేష్, రామకృష్ణారావు, మన్మధరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు మరియు కృష్ణదేవిపేట జడ్పీ హైస్కూల్ ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
@APPOLICE100

































































